ఎనిమిదేళ్ళ తర్వాత జరుగుతున్న అఫ్ఘానిస్తాన్ ఎన్నికలు

తాలిబన్ ప్రభుత్వం కూలిపోయిన 2001 తర్వాతి నుంచి ఇప్పటి వరకు రెండుసార్లు మాత్రమే అఫ్గనిస్తాన్ లో ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు మూడోసారి జరగబోతున్నాయి. 2015లో జరగవలసిన ఈ ఎన్నికలు వాయిదాలు పడి పడి చిట్టచివరికి ఇప్పుడు జరుగుతున్నాయి. తాలిబన్ సాయుధ దళాల దాడులు ఇంకా కొనసాగుతున్న అఫ్గనిస్తాన్ లో ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించడానికి ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తోంది. కాని “ఈ ఎన్నికలు బోగస్ ఎన్నికలని, జరగనీయమ”ని తాలిబాన్లు ప్రకటించారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు దిగువసభకు జరిగే ఎన్నికలు. ఇందులో 250 స్థానాలున్నాయి. వాటిలో 10 స్థానాలు సంచారతెగలకు రిజర్వు చేశారు. ఒక స్థానం హిందువులకు, ఒక స్థానం సిక్కులకు రిజర్వు చేశారు. ఆఫ్ఘానిస్తాన్ లో సైతం మైనారిటీలకు మతపరమైన రిజర్వేషన్లు ఉండడం సంతోషించదగ్గ విషయం. మరో 68 స్థానాలు మహిళలకు రిజర్వు అయ్యాయి. మొత్తం 2565 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఇందులో 417 మంది మహిళలు. ఇందులో రెజిస్టర్ అయిన రాజకీయ పక్షాల తరఫున పోటీ చేస్తున్నది కేవలం 205 మంది మాత్రమే. మిగిలిన వారు స్వతంత్ర్య అభ్యర్థులు. సలాహుద్దీన్ రబ్బానీ నాయకత్వంలోని జమాఅతె ఇస్లామీ, ముహమద్ ముహాఖిక్ నాయకత్వంలోని పీపుల్స్ ఇస్లామిక్ యూనిటీ ఆఫ్ ఆఫ్గనిస్తాన్, కరీం ఖలీలీ నాయకత్వంలోని హిజ్బె వహదతె ఇస్లామీ, సిబ్ఘతుల్లాహ్ సంజార్ నాయకత్వంలోని హిజ్బె జమ్హూరీ అఫ్గనిస్తాన్, అబ్దుల్ రషీద్ దోస్తుం నాయకత్వంలోని జుంబిషె మిల్లి ఇస్లామీ, గుల్బుద్దీన్ హిక్మత్యార్ పార్టీ హిజ్బె ఇస్లామీ రంగంలో ఉన్నాయి. హింసాకాండ కొనసాగినా ఎన్నికలు నిర్వహించగలమన్న సందేశాన్ని అఫ్గనిస్తాన్ ప్రభుత్వం తాలిబాన్లకు ఇవ్వాలనుకుంటోంది. తాలిబాన్లు చర్చలకు దిగివచ్చేలా ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

Related posts