అనాథ ముస్లిం బాలికలకు మతాంతర వివాహాలు చేసిన యూపీ ప్రభుత్వం

ఉత్తరప్రదేశ్ సామూహిక వివాహాల పథకంలో భాగంగా లక్నోలో నలుగురు అనాథ ముస్లిం అమ్మాయిలను హిందూ అబ్బాయిలతో వివాహాలు జరిపించిన సంఘటనపై న్యాయవిచారణ జరగాలని ముస్లిం నేతలు డిమాండ్ చేస్తున్నారు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కోర్టులో ఈ వివాహాలు జరిగాయి. ఆ తర్వాత అగ్ని ప్రదక్షిణలు కూడా జరిపించారు. ఈ కార్యక్రమంలో మరో 27 హిందూ జంటలకు కూడా వివాహాలు జరిగాయి. ఈ నలుగురు ముస్లిం అమ్మాయిలు ఆరేళ్ళ వయసున్నప్పుడు అనాథశరణాలయంలో చేరారు. ముస్లిం పేర్లున్నప్పటికీ అనాథ శరణాలయంలో ఉన్నప్పుడు వారు ముస్లిం ఆచారాలేవీ పాటించేవారు కాదంటూ ప్రభుత్వ అధికారులు వివరణ ఇస్తున్నారు. ఆరేళ్ళ అమ్మాయిలు స్వయంగా ఒక మత ఆచారాల్ని ఎలా పాటించగలరో వాళ్ళ విజ్ఞతకే తెలుసు. పైగా వివాహం తర్వాత వారు భర్తల మతాన్నే అనుసరిస్తారని కూడా ఈ అధికారులు సెలవిచ్చారు. ఈ మొత్తం వ్యవహారంపై న్యాయవిచారణ జరగాలని ఈద్గా ఇమామ్ మౌలానా ఖాలిద్ రషీద్ ఫిరంగీ చెప్పారు. ఈ అమ్మాయిలకు విద్యాబుద్ధులు చెప్పేందుకు, వివాహాలకు ముస్లిం పెద్దలను ఎందుకు సంప్రదించలేదని ఆయన ప్రశ్నించారు. షియా మతపెద్ద సైఫ్ అబ్బాస్ కూడా ఈ విషయంలో న్యాయవిచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనల వల్ల హిందూ ముస్లిం వర్గాల మధ్య సత్సంబంధాలు దెబ్బతింటాయని చెప్పారు.

Related posts