మాల్కం ఎక్స్ కు సరైన వారసుడు ఉర్దుగాన్: మాల్కం ఎక్స్ కుమార్తె

అమెరికాలో 50 వ 60 వ దశకాలలో అత్యంత ప్రముఖ నాయకుడు ‘మాల్కం ఎక్స్’ అని పిలువబడే మలిక్ అల్ షహ్బాజ్. ఆయన 1965లో మరణించినా ఇప్పటికీ అమెరికన్లకు, ప్రత్యేకించి నల్లజాతి వారికి, ముస్లిమ్ లకు ఆయన స్ఫూర్తిదాయకుడే. మాల్కం ఎక్స్ కుమార్తె ఇల్యాసా షాబాజ్ ఇటీవల టర్కీ అధ్యక్షుడు తయ్యిబ్ ఉర్దుగాన్ ను కలుసుకున్నారు. ఆ సమావేశం తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి మాల్కం ఎక్స్ ఆశయాలకు అసలైన వారసుడు ఉర్దుగాన్ అన్నారు.  తన సోదరి ఖుబిలా షాబాజ్ తో కలిసి ఆమె ఉర్దుగాన్ ను కలుసుకున్నారు. ఉర్దుగాన్ భార్య లేడి అమీనా ఉర్దుగాన్, వారి కుమార్తె అస్రాలను కలుసుకున్నారు. మాల్కం ఎక్స్ ఆశయాలకు ప్రాతినిధ్యం వహించే ఉర్దుగాన్ తో సమావేశం ఎంతో సంతోషం కలిగించిందని చెప్పారు. మా నాన్నగారు ప్రతి వ్యక్తి గౌరవోన్నతుల కోసం పనిచేశారు. “మానవులందరినీ అల్లాహ్ ఒకే తల్లిదండ్రులనుండి పుట్టించాడు కాబట్టి మనమందరమూ సోదరులమే. అందువల్ల జాతి, మతం, వర్ణం అనేవి ముఖ్యం కానేకావు. మంచి చెడు రెండింటిని వేర్వేరు చేసి చూడాలని నాన్న చెప్పేవారు. మనం ఏదన్నా చెడును చూస్తే దాన్ని మార్చడానికి ప్రయత్నించాలనేవారు” అంటూ వారిద్దరు తమ తండ్రిని గుర్తు చేసుకున్నారు. టర్కీ చేపడుతున్న మానవీయ సహాయాన్ని వారు ప్రశంసించారు. ముఖ్యంగా లక్షలాది సిరియా ప్రజలకు ఆశ్రయమివ్వడం ప్రపంచానికి ఒక ఆదర్శమని చెప్పారు. టర్కీ 35 లక్షల మంది శరణార్ధులకు ఆశ్రయమిచ్చింది. శరణార్థులు రాకుండా ఎత్తైన గోడలు కట్టడానికి అగ్ర రాజ్యాలే ప్రయత్నిస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి ప్రభుత్వం కూడా ఉందని ఆమె అన్నారు. టర్కీ ప్రజలు చాలా మృదుస్వభావులని, జాతి, రంగు, స్త్రీపురుష వివక్ష వారిలో కనబడదని అన్నారు.

Related posts