చైనాలో ముస్లిములపై ఆంక్షలన్న పుకార్లు

ముస్లిములు తమ ఖుర్ ఆన్ గ్రంథ ప్రతులను, నమాజు చేసుకునే తివాచీలు (జానిమాజు) లను ప్రభుత్వానికి అప్పజెప్పాలని, లేకపోతే తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయని చైనా ప్రభుత్వం నిర్బంధం చేసినట్లు పుకార్లు వస్తున్నాయి. ముస్లిములు తమ మతసంబంధమైన వస్తువులన్నింటిని అప్పజెప్పాలని ఆదేశాలు జారీ అయ్యాయట. చైనాలోని గ్జియాంగ్ జిన్ ప్రాంతంలో ఉయిగుర్ ముస్లిమ్ జనాభా ఉంది. ఉయిగుర్ ముస్లిములందరూ తమ ఖుర్ఆన్ కాపీలను, నమాజు చేసుకునే జానిమాజులు తదితర ధార్మిక వస్తువులన్నీ ప్రభుత్వానికి అప్పజెప్పాలన్న నోటిఫికేషన్లు జారీ అయ్యాయన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ ఆదేశాలు కజాక్, కిర్గిజ్ ముస్లిములకు కూడా వర్తిస్తాయని చెప్పబడుతోంది.

చైనా ప్రభుత్వం ఈ ఆరోపణలను కొట్టివేసింది. ఉయిగుర్ ముస్లిములు ఖుర్ఆన్ కాపీలు, నమాజు చేసుకునే జానిమాజులు స్వాధీనం చేయాలంటూ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని వివరణ ఇచ్చింది. ఈ విషయమై వచ్చిన మీడియా వార్తలన్నింటిని చైనా విదేశీ మంత్రిత్వశాఖ ప్రతినిధి ఖండించారు. ఉయిగుర్ ప్రాంతం ప్రశాంతంగా ఉందని, అనవసరపు పుకార్లు నమ్మవద్దని అన్నారు. ఏదేమైనా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తన నివేదికలో కూడా చైనా ప్రభుత్వం ముస్లిముల మతస్వేచ్ఛను నిరాకరిస్తుందని ఇదివరకే చెప్పిన విషయం గమనార్హం. ముఖ్యంగా ఉయిగుర్ ముస్లిమ్ రచయితలపై నిర్బంధం అమలవుతోందని చెప్పింది.

Related posts