పదకొండు రూపాయలకే సివిల్స్ కోచింగ్ ఇస్తున్న ముతి ఉర్ రహ్మాన్

కేవలం పదకొండు రూపాయలు మాత్రమే తీసుకుని ఐయేయస్, ఐపియస్ కోచింగ్ ఇస్తున్న ముతి ఉర్ రహ్మాన్ సమాజానికి చేస్తున్న సేవ అసాధారణమైనది. బడుగు బలహీనవర్గాల విద్యార్థులకు అవసరమైన కోచింగ్ ఆయన ఉచితంగానే అందిస్తున్నారని చెప్పాలి. సివిల్స్ కోచింగ్ ఇచ్చే కేంద్రాలు దేశమంతటా చాలా ఉన్నాయి. భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇలాంటి కోచింగ్ కేంద్రాల్లో చేరాలంటే పేద విద్యార్థులకు సాధ్యం కాదు. సివిల్ సర్వీసెస్ అధికారులుగా సమాజానికి సేవ చేసే అవకాశం వారికి దొరకదు. అలాంటి పరిస్థితుల్లో ముతి ఉర్ రహ్మాన్ ఆపద్బాంధవుడిలా పేదవిద్యార్థులను ఆదుకుంటున్నారు. బీహారులోని పాట్నాకు చెందిన ముతి ఉర్ రహ్మాన్ ఐయేయస్, ఐపియస్ పరీక్షలు రాయాలనుకునే వారికి గురు రహ్మాన్ గా పేరు సంపాదించుకున్నారు.

భారీగా ఫీజులు చెల్లించలేని పేద విద్యార్థులకు కేవలం పదకొండు రూపాయల ఫీజుతో ముతి ఉర్ రహ్మాన్ నాణ్యమైన కోచింగ్ అందిస్తున్నారు. మూడు పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీలు, పిహెచ్ డీ చేసిన రహ్మాన్ ఉపాధి కోసం ట్యూషన్లు ప్రారంభించారు. 1994లో బీహారు ప్రభుత్వం పోలీసు ఇనస్పెక్టర్ల రిక్రూట్ మెంటు చేసినప్పుడు రహ్మాన్ కోచింగ్ సెంటరు విద్యార్థులు గొప్ప ప్రతిభ కనబరిచారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు కోచింగ్ కోసం రావడం ప్రారంభమయ్యింది. తండ్రిలేని షఫీక్ ఆలం అనే విద్యార్థి ఆయన వద్దకు కోచింగ్ కోసం వచ్చాడు. నిరుపేద షఫీక్ ఆలమ్ వద్ద ఫీజు చెల్లించడానికి 11 రూపాయలే ఉన్నాయి. రహ్మాన్ ఆ పదకొండు రూపాయలే గురుదక్షిణగా స్వీకరించి కోచింగ్ ఇచ్చారు. ఆ విద్యార్థి షఫీక్ ఆలమ్ ఇప్పుడు జిల్లా కలెక్టరు. ఆ విధంగా రహ్మాన్ పదకొండు రూపాయల ఫీజు ప్రారంభమైంది. పదివేల కన్నా ఎక్కువ మంది విద్యార్థులకు ఆయన కోచింగ్ ఇచ్చారు. అందులో చాలా మంది ఇప్పుడు వివిధ హోదాల్లో ప్రభుత్వాధికారులుగా పనిచేస్తున్నారు. ఆయన వద్ద కోచింగ్ తీసుకుని ఉన్నతోద్యోగాల్లో స్థిరపడిన విద్యార్థులు తమ వంతుగా పేదవిద్యార్థుల కోచింగ్ కోసం ఆర్ధిక సహాయం అందిస్తున్నారు. ఆయన వద్ద కోచింగ్ తీసుకున్న ఐపియస్ అధికారిణి మీను కుమారీ గర్వంగా తాను కూడా గురువు గారి వద్ద పదకొండు రూపాయల ఫీజు చెల్లించిన విద్యార్ధినిగా చెప్పుకుంటారు.

2004లో దాదాపు ఇరవై వేల మంది విద్యార్థులు తన వద్దకు వచ్చారని ఆయన తెలిపారు. కాని వచ్చిన విద్యార్థుల్లో చాలా మంది నిరుపేదలు. గురు రహ్మాన్ ఆ పేద విద్యార్థులకు చదువు చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఆ విద్యార్థుల్లో చాలా మంది ఇప్పుడు బీహారులో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. డబ్బులు లేకపోతే గురు రహ్మాన్ వద్దకు వెళదాం పదండి అని నేడు విద్యార్థులు భావిస్తున్నట్లు తెలిసి తనకు చాలా గర్వంగా ఉందని ఆయన అన్నారు.

Related posts